వర్జీనియా లో వేడుక -నాటా వారి

news


Washington DC:ఉత్తర అమెరికా తెలుగు సమితి (NATA) DC వేడుకల సందర్భంగా ఇక్కడి వర్జీనియా రాష్ట్రంలోని Stone Bridge High School వేదికగా జనవరి 30న జరిపిన సంబరాలు అంబరాన్ని తాకాయి.    సుమారుగా రెండువేలమంది ప్రవాస భారతీయులు పాల్గొన్న ఈ సంబరాలు ఆద్యంతం అద్భుత కార్యక్రమాలతో రక్తి కట్టించాయి.

జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా నాటా అధ్యక్షులు శ్రీ మోహన్ మల్లం గారు నాటా ఉపాధ్యక్షులు శ్రీ రాఘవరేడ్డిగారు,కోశాధికారి శ్రీ హరి వేల్కురు గారు పాల్గొన్నారు.శ్రీ మోహన్ గారు ఉపన్యసిస్తూ  మన సంస్కృతి సాంప్రదాయాలనే పునాదులుగా చేసుకొని ఉధ్భవించిన  నాటా, మత ప్రాంత వర్గ విచక్షణలకు అతీతంగా నిలిచి  ప్రజల చేత తెలుగు ప్రజల కోసం ఆవిర్భవించిన సంస్థగా సెలవిచ్చారు.  తెలుగుదనాన్నే  వేదికగా చేసుకొని  మన చరితలోని చైతన్యాన్ని తీసుకొని, నవతరంగాల ఊపుతో ఎప్పుడూ భవితవైపు సాగే భారతీయతను నిలపడమే నాటా లక్ష్యమని పేర్కొన్నారు.అంతేగాక నాటా సంస్థయొక్క ప్రాధమిక లక్ష్యమైన “సాంస్కృతిక వికాసమే నాటా మాట,సమాజ సేవయే నాటా బాట” అన్న స్ఫూర్తితో నడిచే నాటా సభ్యులనందరినీ ప్రశంసించారు. పిదప రాఘవరెడ్డిగారు ప్రసంగిస్తూ మన తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలలో నాటా వారు నిర్వహించిన వివిధ సేవాకార్యక్రమాలను సబికులందరికీ తెలియజేస్తూ ఇంతటి అద్వితీయమైన కార్యక్రమాన్ని తీర్చిదిద్దడంలో నాటా DC Team శ్రమించిన తీరును ఆ శ్రమ వెనుక దాగున్న వారి అంకిత భావాన్ని ,వారి అంకిత భావానికి పరోక్షంగా కారకులైన వారి వారి కుటుంబ సభ్యుల  అద్వితీయ  ప్రోత్సాహాన్ని కొనియాడారు. 
ఈ వేడుకలలో భాగంగా నిర్వహించిన పలు ఆసక్తికర పోటీలలో విధ్యార్థులు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.చెస్,రంగోళి,పాటల పోటీలు,Dubsmash మరియు సాంస్కృతిక కళలలో పొటీలు నిర్వహించి విజేతలకు జ్ఞాపికలను ప్రదానం చేశారు.Paradise Indian Cuisine, Gwynn Oak , Maryland వారు అందించిన పసందైన పంచభక్ష పరమన్నాలు అద్భుతమంటూ ఆరగించిన  అతిధులందరూ అభివర్ణించారు .భావి అధ్యక్షులు  శ్రీ రాజేశ్వర్ గంగసాని గారు,ప్రదీప్ సమల గారు ,ప్రధాన సలహాదారులు శ్రీ స్టాన్లి రెడ్డిగారు ముందు రోజు జరిగిన నాటా ప్రారంభ వేడుకలకు శ్రీకారం చుట్టారు.

సాంస్కృతిక సాహిత్య రంగాలని మేళవించి పాశ్చ్యాత్య సంగీతపు హోరును శృతిమించనీయక విన్నూత తరహా వినోదాన్ని  అందించడంలో నాటా చేసిన కృషి జగద్విదితం. తరాలు మారినా తెలుగు సంస్థల తలరాతలు మారవు అన్న నానుడిని పాతేసి  తెలుగువారికి ,సాంస్కృతిక కళల అభిరుచిలో,సాహిత్యాభిరుచిలో ఓ రూపునిచ్చి ,వినోదాత్మక కార్యక్రమాలలో విశేషకృషిసల్పి సరికొత్త దిగంతాన్ని చూపించింది నాటా సంస్థ .ఈ వేడుకలకు విచ్చేసిన ప్రఖ్యాత గాయనీ గాయకులు సుమంగళి గారు,Super Singer ధనుంజయ్ గారు పాడిన గీతాలకు పసివారు సైతం చిందులు వేస్తూ సందడి చేశారు.Tollywood  హీరోయిన్లు తేజస్విని మరియు రిచా పనాయ్ చేసిన నృత్యాలు సభికులను అలరించాయి.పిదప Dance Master రఘు  నృత్యాలకు ప్రేక్షకుల హర్షధ్వానాలతో,ఈలలతో సభా ప్రాంగణమంతా హోరెత్తింది.లయబద్దంగా ఆడే తన పాద కదలికలు విజ్ఞులనే కాదు.. రసజ్ఞులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తాయి అనడం అతిశయోక్తి కాదేమో?

నాటా దర్శకుల దక్షతకు కార్యకర్తల దీక్షకు దర్పణం మన ఈ సంబరం.ఇంతటి అపురూప నాటా సృష్ఠి కర్తలైన వ్యవస్థాపకులకు,నిర్మాణంలో భాగస్వాములైన ప్రతినిధులకు ఇన్ని విజయాలకు ప్రధానకారకులైన తెలుగు ప్రజలందరికీ నాటా వారు అభినందనలు తెలియజేశారు.అన్నింటికంటే ముఖ్యంగా దిగువ స్థాయిలో కార్యవర్గాన్ని బలోపేతం చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన ప్రాంతీయ నాటా DC నాయకుల పాత్ర మరువలేనిది.తమకు తాము స్వచ్చంగా తరలివచ్చి,నాటా కొరకు తమ విలువైన వ్యక్తిగత సమయాన్ని వెచ్చించి ఈ వేడుకలను విజయవంతం చేయడంలో తమ వంతు పాత్ర నిర్వర్తించిన Volunteersని ఈ సందర్భంగా అభినందించారు.

ఈశాన్య రాష్ట్రాల తెలుగువారికి నాటావారు అందించిన అపురూపమైన కానుకగా ఈ వేడుకలను పలువురు అభివర్ణించడం కొసమెరుపు.


నమస్సుమాంజలులతో..
మీ నాటా..
సమాజ సేవయే నాటా బాట..!

 Feb 3 2016